సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, ఆగస్టు 2026, బుధవారం

దుర్గాసూక్తము - శ్రీవిద్య పరంగా అర్ధము 6వ మంత్రము

 

6.   ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ స॒నాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ॒ సత్సి॑
స్వాంచాఽగ్నే త॒నువం॑ పి॒ప్రయ॑స్వా॒స్మభ్యం॑ చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ

·         ప్రత్నః – ప్రాచీనమైన, అనాదిగా ఉన్నవాడు (వైదికంగా అగ్ని అని భావన). శ్రీవిద్యపరంగా – ప్రాచీనమైనది అనగా శ్రీమాతయే. ఈ మంత్రం శ్రీలలితారహస్యనామాలలోని పూర్వజా’, ‘పురాతనాఅన్న నామాల్ని ధ్రువీకరిస్తున్నది. జగత్తును సృష్టించకమునుపే ఉన్నది. ఆది అంతము లేనిది. సర్వేషాం ఆదిభూతత్వాత్ పురాతనా

·         ఈడ్యః – స్తుతించదగినవాడు, పూజనీయుడు. శ్రీవిద్యపరంగా – పూజనీయురాలు.

అన్నింటికన్నా ముందు ఉన్నది, పంచకృత్యపరాయణ అయిన ఆమె సర్వదా పూజనీయురాలు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆమె అనాదిగా ఉన్నప్పటికీ, ప్రతి సాధకుని హృదయంలో నూతనమైన చైతన్యానుభూతిగా వెలుగుతుంది.

·         అధ్వరేషు – యజ్ఞాలలో, శ్రీవిద్యపరంగా – కుండలి అధిష్టించబడిన చిదగ్ని కుండము. శ్రీవిద్యోపాసకులు ఈ చిదగ్ని కుండములోనే విరజాహోమం చేస్తారు. ఇది గురువుద్వారా నేర్చుకోవలసిన జ్ఞానము.

·         సనాత్ చ హోతా – ప్రాచీనకాలం నుండి యజ్ఞానికి హోతగా ఉన్నవాడు. శ్రీవిద్యపరంగా – సాధకుడు చేసే శ్రీచక్రోపాసనే యజ్ఞము. సాధకుని అంతరంగమే యజ్ఞవేదిక. సాధకుడు చేసే సాధనను – ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసలనే హవిస్సులను హృదయకుండంలో ఉండే జ్ఞానాగ్నికి అర్పించే ప్రధాన హోత శ్రీమాతయే.

·         నవ్యః చ సత్సి – ప్రతి యజ్ఞములో నూతనంగా ప్రత్యక్షమయ్యేవాడు. శ్రీవిద్యపరంగా – ఇది సనాతనమైనా ప్రతి క్షణం నూతనంగా అనుభవింపబడేది. ఇది చాలా అందమైన భావన. అనాది అయిన ఆమె – నిత్యా (శ్రీలలితారహస్యనామము) కూడ. శాశ్వతమైనది. ఎల్లప్పుడూ ఉండేది. శ్రీవిద్యోపాసకులకు ఇది చాలా సాధారణమైన అందమైన భావన ఎందుకంటే, వారు ప్రతిరోజూ అదే మంత్రాన్ని జపించినా, అదే శ్రీచక్రాన్ని ఆరాధిస్తున్నా, దేవీ చైతన్యానుభూతి ప్రతిదశలో కొత్తగా వికసిస్తూ ఉంటుంది. అందుకే ఆమె అనాది, నిత్య మరియు నవ్యఃచ సత్సి (ఎప్పుడూ నూతనంగా ప్రత్యక్షమయ్యేది)

·         స్వాం తనువం పిప్రయస్వ – నీ స్వరూపాన్ని, శక్తిని వృద్ధి చేసుకో, శ్రీవిద్యపరంగా – తనువు అంటే అంతరంగం, చిదగ్ని అని అర్ధం. సాధకునిలో మంత్రశక్తి బలపడడం, చిత్తశుద్ధి కలగడం, అంతర్ముఖత పెరగడం, దేవీభావం స్థిరపడడం మొదలైనవి వృద్ధి చెందడం.

·         అస్మభ్యం చ సౌభగమాయజస్వ – మాకు సౌభాగ్యం, శ్రేయస్సు ప్రసాదించు, శ్రీవిద్యపరంగా – సౌభాగ్యం అంటే దేవీ అనుగ్రహం, మంత్రసిద్ధి, జ్ఞానం, భక్తి, శివశక్తి సామరస్యం మొదలైనవి. ఓ దేవీ, పై విధంగా అంతర్యాగమనే యజ్ఞములో ఆరాధించబడుతున్న నీవు సౌభాగ్యాన్ని, శ్రేయస్సును ప్రసాదించు అని చేసే ప్రార్థన.  

ఈ మంత్రం యొక్క సంపూర్ణ భావము

వైదికంగా – యజ్ఞాగ్నిని స్తుతించి, యజ్ఞాన్ని స్వీకరించి శ్రేయస్సును ప్రసాదించమని చేసే ప్రార్థన.

శ్రీవిద్యపరంగా – హృదయంలో చిదగ్నిని ప్రజ్వలింపచేసి, అంతర్యాగం ద్వారా అహంకారాన్ని సమర్పించి, దేవీచైతన్యాన్ని విస్తరింపచేసి, పరమ సౌభాగ్యమైన శివశక్తి సామరస్యాన్ని ప్రసాదించమని చేసే ప్రార్థన.

ఇంకాఉంది...

5, ఆగస్టు 2026, బుధవారం

దుర్గాసూక్తము - శ్రీవిద్య పరంగా అర్ధము 5వ మంత్రము

 

1.    5. పృ॒త॒నా॒ జిత॒గ్ం॒ సహ॑మానము॒గ్రమ॒గ్నిగ్ం హు॑వేమ పర॒మాథ్స॒ధస్థాత్
స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॒ క్షామ॑ద్దే॒వో అతి॑ దురి॒తాఽత్య॒గ్నిః

·         పృతనాజితమ్ – యుద్ధాలలో విజయం సాధించేవాడు. శ్రీవిద్య పరంగా, ఇక్కడ యుద్ధం అంటే అంతర్ముఖ యుద్ధం. అరిషడ్వర్గాలను జయించే శక్తి. ఆమె శ్రీలలితా పరాభట్టారిక

·         సహమానం – శత్రువులను, విఘ్నాలను జయించేవాడు.

·         ఉగ్రమ్ – మహాపరాక్రమశాలి

సుషుమ్నా నాడి ద్వారా కుండలినీ శక్తి ఊర్ధ్వముఖంగా పయనించేటప్పుడు అజ్ఞానాన్ని, మాయను మరియు బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంథులను భేదించే తీవ్రమైన యోగాగ్ని/చిదగ్ని. పై రెండు మహాకాళీ, వారాహీ మొదలైన విఘ్ననాశక శక్తులను గుర్తు చేస్తుంది. సాధకునిలోని అవిద్య, కర్మబంధం, మలాలను దహించే చిదగ్ని శక్తి.

·         అగ్నిమ్ హువేమ – అగ్నిదేవుని ఆహ్వానిస్తున్నాము. శ్రీవిద్య పరంగా ఈ అగ్ని – చిదగ్ని, కుండలినీ శక్తి, శ్రీమాత యొక్క జ్ఞానాగ్ని

·         పరమాత్ సధస్థాత్ – పరమమైన దివ్యస్థానం నుండి. శ్రీవిద్య పరంగా, ఇది బిందువు స్థానం. కామేశ్వరి, కామేశ్వరుల నివాసస్థానము. ఇది మానవ శరీరంలో సహస్రార చక్రము. అక్కడ నుండి ప్రసరించే పరాశక్తిని సాధకుడు ఆవాహన చేస్తున్నాడు.

·         సనః పర్షత్ – ఆయన మమ్మల్ని దాటించుగాక

·         అతి దుర్గాణి విశ్వా – అన్ని కష్టాలను, ప్రమాదాలను

శ్రీవిద్యపరంగా – శ్రీవిద్యాసాధనలోని విఘ్నాలు, మంత్రజప అవరోధాలు, అహంకారం, కర్మబంధాలు, మాయా భ్రమలు మొదలైనవి

·         క్షామత్ – కష్టాలు, దుఃఖాలు, దారిద్ర్యం నుండి. శ్రీవిద్య పరంగా, ఇక్కడ క్షామ అంటే ఆధ్యాత్మిక బలహీనత, భక్తి తగ్గిపోవడం, మనస్సు చంచలత వంటివి

·         దేవః అగ్నిః – దివ్యస్వరూపుడైన అగ్నిదేవుడు, శ్రీవిద్య పరంగా – ఓ చిదగ్నికుండ సంభూత శ్రీమాతా

·         అతి దురితాత్ – సమస్త పాపాలు, అపాయాల నుండి

ఈ మంత్రం యొక్క సంపూర్ణ భావము

వైదికంగా – అగ్నిదేవుని పరాక్రమాన్ని స్తుతిస్తూ జీవనంలో అన్ని కష్టాలు, ప్రమాదాలు, శత్రువులు, దురితాల నుండి రక్షణకోరే మంత్రము. ఇది ప్రత్యక్ష భావాన్ని తెలుపుతున్నది.

శ్రీవిద్యపరంగా – చిదగ్నిరూపిణి శ్రీమాతను ఆవాహన చేసి, అంతర్గత శత్రువులను జయించి, మాయా-కర్మ బంధాలను అధిగమించి, శ్రీచక్ర బిందు తత్త్వమైన పరబ్రహ్మానుభూతికి చేరాలని చేసే ప్రార్ధన. ఇది అంతర్లీన భావాన్ని తెలుపుతుంది.

ఇంకాఉంది...

27, జులై 2026, సోమవారం

దుర్గాసూక్తము - శ్రీవిద్య పరంగా అర్ధము 4వ మంత్రము

 

1.            4. విశ్వా॑ని నో దు॒ర్గహా॑ జాతవేదః॒ సింధు॒న్న నా॒వా దు॑రి॒తాఽతి॑పర్-షి
    అగ్నే॑ అత్రి॒వన్మన॑సా గృణా॒నోఽస్మాకం॑ బోధ్యవి॒తా త॒నూనామ్

·         జాతవేదః – సమస్తాన్నీ తెలిసిన అగ్నిదేవా! శ్రీవిద్య పరంగా ఇక్కడ జాతవేదుడంటే చిదగ్ని. అనగా చిదగ్నికుండ సంభూత శ్రీలలితా మహాత్రిపురసుందరి అని అర్థం. ఆమెయే సమస్త సృష్టికి మూలమైన చైతన్య శక్తి

·         విశ్వానినో దుర్గహా – సమస్తమైన మాకు కష్టాలు, ప్రమాదాలు, విఘ్నాలు. శ్రీవిద్యపరంగా – అవిద్య, అహంకారం, వాసనలు, కర్మభంధాలు, ఇంతకు ముందు ఒకటవ మంత్రంలో చెప్పిన విధంగా మూడు మలాలు, అరిషడ్వర్గాలు మొదలైన కష్టాలు

·         సింధుం న నావా – సముద్రాన్ని దాటించే పడవలాగ. శ్రీవిద్య పరంగా ఆ నావ ఏదనగా – గురుకృప, శ్రీవిద్యా మంత్రం, శ్రీచక్రారాధన, దేవీ అనుగ్రహం. సింధుం – సముద్రము. ఈ సముద్రాన్ని శ్రీవిద్యా మంత్రము (ముఖ్యముగా పంచదశి లేదా షోడశి) అనే నావ ద్వారా దాటించడం

·         దురితాతి పర్షి – పాపాలు, కష్టాలు, అపాయాల నుండి దాటించు.

·         అగ్నే – ఓ అగ్ని దేవా, శ్రీవిద్యపరంగా, ఓ శ్రీలలితా మహాత్రిపురసుందరీ (చిదగ్ని)

·         అత్రివత్ మనసా గృణానః – అత్రి మహర్షి వలే ఏకాగ్రచిత్తంతో నిన్ను ప్రార్థిస్తున్నాము. శ్రీవిద్య పరంగా, అత్రి అనగా జ్ఞాత-జ్ఞానం-జ్ఞేయం అనే త్రిపుటిని దాటిని ఋషి. ఏకాగ్ర, చిత్తశుద్ధితో దేవిని ప్రార్థించడం. ఆమే త్రిపురసుందరిగా ఈ మూడు శరీరాలను దహించి, సాధకుడిని శివత్వంలో లయింపచేస్తుంది.

·         అస్మాకం బోధి – మాకు జ్ఞానం ప్రసాదించు. శ్రీవిద్య గురించిన జ్ఞానం. ఇదే బ్రహ్మవిద్య

·         అవితా తనూనాం – మా శరీరాలకు, ప్రాణాలకు రక్షకుడిగా ఉండు. శ్రీవిద్యపరంగా శరీరమంటే స్థూల, సూక్ష్మ, కారణదేహాలు. దేవి వాటిని శుద్ధి చేసి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించమని చేసే ప్రార్థన.

ఇక్కడ మరొక రహస్యార్ధము – శ్రీచక్రములోని ఆవరణలే తను’. సాధకుడు శ్రీచక్రోపాసన అనే తన సాధన ద్వారా ఈ ఆవరణలను దాటి బిందువులో కొలువై ఉన్న కామేశ్వరీ-కామేశ్వరులలో ఐక్యం పొందడం. అదే సర్వానందమయము

ఈ మంత్రం యొక్క సంపూర్ణ భావము

వైదికంగా ఓ అగ్నిదేవా! సమస్త కష్టాల నుండి మమ్మల్ని పడవ సముద్రాన్ని దాటించినట్లుగా మమ్మల్ని దాటించు. అత్రిమహర్షి వంటి భక్తితో స్తుతిస్తున్న మాకు జ్ఞానాన్ని ప్రసాదించి మా శరీరాలకు, ప్రాణాలకు రక్షకుడవై ఉండు అని అర్థము.

శ్రీవిద్య పరంగా – చిదగ్ని రూపిణి పరాశక్తి అనుగ్రహంతో సాధకుడు అవిద్యను అధిగమించి పరమచైతన్యంలో స్థిరపడాలని చేసే అంతర్ముఖ ప్రార్థన.

ఇంకాఉంది...

21, జులై 2026, మంగళవారం

దుర్గాసూక్తము - శ్రీవిద్య పరంగా అర్ధము 3వ మంత్రము

 

1.   3.  అగ్నే॒ త్వం పా॑రయా॒ నవ్యో॑ అ॒స్మాన్స్వ॒స్తిభి॒రతి॑ దు॒ర్గాణి॒ విశ్వా’’
పూశ్చ॑ పృ॒థ్వీ బ॑హు॒లా న॑ ఉ॒ర్వీ భవా॑ తో॒కాయ॒ తన॑యాయ॒ శంయోః

·         అగ్నే – ఓ దేవా! శ్రీవిద్య పరంగా అగ్ని అంటే చిదగ్ని. అదే పరాశక్తి యొక్క జ్ఞాన శక్తి. అదే కుండలినీశక్తి

·         త్వంపారయా – మమ్మల్ని దాటించు, రక్షించు. శ్రీవిద్య పరంగా సాధకుడిని మాయ, కర్మ, అవిద్య అనే సంసారసాగరం నుండి పరబ్రహ్మస్థితికి చేర్చు.

·         నవ్యః – ఉత్తమమైన, శ్రేష్ఠమైన మార్గంలో, శ్రీవిద్య పరంగా – శ్రీవిద్యా సాధనే ఉత్తమమైన మార్గము.

·         అస్మాన్ – మమ్మల్ని

·         స్వస్తిభిః – శుభమార్గాలతో, క్షేమాన్ని కలిగించే ఉపాయాలతో, శ్రీవిద్యోపాసనే శుభమార్గము. పంచదశి, షోడశి, శ్రీచక్రోపాసన మొదలైన శుభమార్గాలలో అది క్షేమమును కలిగిస్తుంది. భోగ-మోక్షకారిణి విద్య

·         అతి దుర్గాణి విశ్వా – అత్యంత కష్టములను, విపత్తులను, అవరోధాలను. శ్రీవిద్య పరంగా – ఆణవ, మాయిక, కార్మిక మలములు, అహంకారం, వాసనలు, అవరోధాలు అతి దుర్గములు.

·         పూశ్చపృథ్వీ బహులాన ఉర్వీ భవా – సమస్త జీవజాలమునకు విశాలమైన భూమి ఏ విధంగా ఆధరమో, రక్షణో ఆ విధంగా మాకు రక్షణగా ఉండు. శ్రీవిద్య పరంగా చైతన్యం, హృదయ విశాల విస్తృతి. సుషుమ్నా మార్గములో కుండలినీ శక్తి విస్తారణను ఇక్కడ అన్వయించుకోవాలి.

·         తోకాయ తనయాయ శంయోః – మా పిల్లలు, సంతానం, వంశానికి శుభం, క్షేమం కలిగించు. శ్రీవిద్య పరంగా – కేవలం భౌతిక సంతానం మాత్రమే కాదు. సాధకునిలో పుట్టే జ్ఞానం, భక్తి, వైరాగ్యం, మంత్ర సిద్ధి వంటి దైవసంపదలను రక్షించు. అంతేకాదు. గురుపరంపరను రక్షించమని కూడా అర్ధము. తనయ అంటే శిష్యులు, ఆ తరువాతి తరం సాధకులు ఇలా అని అర్ధము. ఇక్కడ శంయోః అంటే శివశక్తి సామరస్యంగా కూడా భావించాలి.

ఈ మంత్రం యొక్క సంపూర్ణ భావము

వైదికంగా ఇది రక్షణ, క్షేమం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రార్థన. ఈ మంత్రంలో భక్తుడు అగ్నిని ప్రార్థిస్తూ భౌతిక, ఆధ్యాత్మిక, దైవిక మూడు రకాల కష్టాల నుండి తమను, తమ సంతానాన్ని, తమ రాజ్యాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాడు.  శ్రీవిద్య పరంగా ఇది చిదగ్ని ద్వారా అవిద్యను దాటి పరాశక్తి సాక్షాత్కారానికి నడిపించే అంతర్ముఖ సాధనకు సంబంధించి అ ప్రార్థన.

                                                                                ఇంకాఉంది...

10, జులై 2026, శుక్రవారం

దుర్గాసూక్తము - శ్రీవిద్య పరంగా అర్ధము 2వ మంత్రము

 

1.    2. తామ॒గ్నివ॑ర్ణాం॒ తప॑సా జ్వలం॒తీం-వైరోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టామ్
దు॒ర్గాం దే॒వీగ్ం శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॒ నమః॑

·         తామ్ = ఆమెను. ఇక్కడ ఆమె అంటే దుర్గాదేవి అని అర్ధం. శ్రీవిద్య పరంగా ఇక్కడ తామ్ అంటే చిదగ్ని. అదే శక్తి.

·         అగ్నివర్ణాం = అగ్ని వంటి తేజస్సు కలది. వెలుగు, పవిత్రత, పాపదహనం, యజ్ఞముఖం, దేవతలకు హవిస్సును చేర్చేది – ఇవన్నీ అగ్ని యొక్క లక్షణాలు. అందుకే ఆమె అగ్ని వర్ణ.

ఇప్పుడు శ్రీవిద్య పరంగా చూస్తే – ఈ అగ్ని బయటది కాదు. చైతన్యాగ్ని. ఈ అగ్ని సాక్షి చైతన్యం. ఈ చైతన్యమే చిత్కలా. చిత్ అంటే సచ్చితానంద రూపమైనది. పరబ్రహ్మ యొక్క కల. ఈ చిత్కలే చైతన్యము. దీని స్వరూపమైనదే పరమేశ్వరి. ఇది కుండలినీ యొక్క ప్రజ్వలిత రూపం. ఆమె మూలాధార చక్రంలో సుషుప్తంగా ఉండి, సాధనతో మేల్కొనబడి సహస్రారంలో పరమశివుడితో ఐక్యం అయ్యే తేజస్సు. శ్రీలలితాసహస్రనామములోని “చిత్కలా” నామము ఇక్కడ గమనించదగినది.

·         తపసాజ్వలంతీమ్ = తపస్సు వల్ల ప్రకాశించేది. వైదికపరంగా తపస్సు అంటే సృష్టికి ముందు పరబ్రహ్మ యొక్క సంకల్పశక్తి.

శ్రీవిద్య పరంగా చూస్తే – ఇక్కడ తపస్సు అంటే నిరంతర ఉపాసన, చైతన్యప్రకాశం. ఉపాసన వలన వ్యక్తమయ్యేది. తపస్సు అనే అగ్నితో మండుతూ వెలుగొందేది. బ్రహ్మే తపస్సు చేసాడని ఉపనిషత్తులు చెబుతాయి. శ్రీవిద్యోపాసన ద్వారా చైతన్యస్వరూపము అనగా ఆత్మసాక్షాత్కారము అనగా స్వరూపనిరూపణము కలుగుతుందని అర్ధము. పంచదశీ, షోడశీ మంత్రముల జపము, శ్రీచక్రార్చనలు తపస్సు అనబడతాయి. ఈ తపః శక్తితో సాధకుని అంతరంగములో దేవి ప్రజ్వలిస్తుంది.

·         వైరోచనీమ్ = వైదికంగా సర్వాన్నీ ప్రకాశింపచేసేది అని అర్ధము. విరోచన అంటే ప్రకాశించడం.

శ్రీవిద్య పరంగా - విరోచనుడు అంటే పరమశివుడు. ఈయనది శివ తత్త్వము, ఆమెది శక్తి తత్త్వము. తురీయ స్వరము ఈ బిందువుతో కూడి విరోచనకు కలపగా వైరోచనీం అవుతున్నాది. అనగా శివశక్తుల ఐక్యత ఇక్కడ కనిపిస్తున్నాది. శ్రీలలితాసహస్రనామములోని “శివశక్తైక్య రూపిణి” నామము ఇక్కడ గమనించదగినది.

·         కర్మఫలేషు జుష్టామ్ = వైదికంగా అన్ని కర్మలకూ తగిన ఫలాన్ని ప్రసాదించేది.

శ్రీవిద్య పరంగా కర్మఫలాన్ని త్యాగం చెయ్యాలి. త్యాగేనైకే అమృతత్వమానశుః అని వేదం చెబుతుంది. త్యాగం వలన మాత్రమే అమృతత్వాన్ని అనగా మోక్షాన్ని పొందుతారు. శ్రీమాత ధర్మ స్వరూపము. ఆమె ఉనికే కర్మఫల నియమం. ఈ భావన కలిగి సాధన చెయ్యాలి. సాధన ద్వారా వచ్చే ఫలితాన్ని తిరిగి ఆమెకే సమర్పించాలి. ఇదే అమృతానికి సుగమము.

శ్రీచక్రార్చనలో చేసే విరజా హోమము ఇక్కడ స్మరించదగినది.

·         దుర్గాం = దుర్గాలను (కష్టాలను) దాటించేది.

శ్రీవిద్య పరంగా – ఇక్కడ కష్టం అంటే నేను అనే అహంకారం. ఈ అహంకారమే సాధనకు పెద్ద అడ్డంకి/కష్టము. అయితే ఈ అహంకారమనే పెద్ద కష్టాన్ని ఏవిధంగా దాటడం. దానికి తర్వాత సమాధానం చెప్పబడుతున్నాది.

·         దేవీమ్ = ప్రకాశ స్వరూపిణి

శ్రీవిద్య పరంగా – ఆ ప్రకాశ స్వరూపిణి సాధకునిలోనే “నేను ఉన్నాను” అనే ఎరుకను కలిగించే సాక్షిచైతన్యం.

·         శరణమహం ప్రపద్యే = నేను ఆమెను శరణు కోరుతున్నాను.

శ్రీవిద్య పరంగా – శరణాగతిని పొందడం. ప్రకాశస్వరూపిణీ, దేవీ నిన్ను పూర్తిగా శరణుగోరుతున్నాను. అహంకారమనే కష్టమునుండి, అరిషడ్వర్గాలనే కష్టాలనుండి నన్ను కడతేర్చు అని భావము.

ఈ ప్రార్థన సాధనకు హృదయంలాంటిది. నా సాధన మీద నాకు గర్వం లేదు. నీ కృపే నాకు మార్గము అని సాధకుడు ఎల్లప్పుడూ భావనలో ఉండాలి. గురు-మంత్ర-దేవత అనే ఈ మూడు స్తంభాల ద్వారా సాధకుడు శరణు వేడతాడు.

·         సుతరసి = అద్భుతంగా దాటించగలది.

శ్రీవిద్య పరంగా – పై విధంగా సాధన చేయడం వలన ఒక్కో ఆవరణను ఆమె దాటిస్తుంది. సంహారక్రమంలో చేసే శ్రీచక్రపూజలోని ఒక్కో ఆవరణను దాటుకుంటూ వెడితే చివరగా లభ్యమయ్యేది బిందువు. అదే శ్రీమాత ఆవాసస్థానము. అదే సహస్రారము, అమృతమయము. అదే మోక్షస్థానము. సాధకుడును భవసాగరమును దాటించి ఒక్కో మెట్టూ ఎక్కిస్తూ మోక్షమును ప్రసాదించేది. అందుకే శ్రీచక్రార్చన భోగ-మోక్షప్రదాయిని.

·         తరసే నమః = ఆ దాటించే శక్తికి నమస్కారము

శ్రీవిద్య పరంగా – ఈ విధంగా అమృతమును ప్రసాదించే ఆ పరమేశ్వరికి నమస్కారము.

ఈ మంత్రం యొక్క సంపూర్ణ భావము

వైదికంగా – ఓ అగ్ని తేజస్సుతో ప్రకాశించే దుర్గాదేవీ! నీవు సర్వజగత్తునూ ప్రకాశింపచేస్తూ, ప్రతి కర్మకు తగిన ఫలాన్నిస్తున్నావు. నిన్ను శరణుకోరుతున్నాను. నన్ను అన్ని కష్టాలనుండి సులభంగా రక్షించు.

శ్రీవిద్యపరంగా – ఓ చిదగ్ని స్వరూపిణి పరాశక్తీ! నీవే నా బుద్ధికి వెలుగు, నా హృదయానికి శాంతి, నా కర్మలకు ధర్మస్వరూపానివి. నా అహంకారమనే నిజమైన కష్టాన్ని నీ కృపాగ్నిలో కరిగించి గురుకృపతో నన్ను నా స్వరూపమైన పరబిందు చైతన్యానికి చేర్చు.

వైదిక దృష్టిలో ఇది అగ్నిదేవత ద్వారా కష్టాలను దాటించే దుర్గాదేవి మంత్రం. శ్రీవిద్యా దృష్టిలో ఇది పరాశక్తి శ్రీలలితాంబికను, కుండలినీ శక్తిని, శివ-శక్తుల అభేదాన్ని తెలిపే మంత్రం.

ఇంకా ఉంది

8, జులై 2026, బుధవారం

దుర్గాసూక్తము - శ్రీవిద్య పరంగా అర్ధము 1వ మంత్రము

శ్రీదుర్గాసూక్తానికి శ్రీవిద్య పరంగా అర్ధమును ఇక్కడ చర్చించబడుతున్నది. ఇందులో శ్రీచక్రోపాసనకు సంబంధించిన రహస్యార్ధాలను కూడా సందర్భానుసారంగా ఇవ్వబడుతున్నాయి. ఇది నా స్వంత రచన కాదు. కొన్ని గ్రంథాలను పరిశీలించి, కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, శ్రీచక్రోపాసనలో నా అనుభవాన్ని జోడించి ఈ అర్థాలను ఇవ్వబడుతున్నాయి. పాఠకులు గమనించగలరు.


శ్రీమాత్రే నమః

శ్రీమహాగణాధిపతయే నమః

శ్రీ గురుస్సర్వకారణ భూతాశక్తిః


ఓమ్ ॥ జా॒తవే॑దసే సునవామ॒ సోమ॑ మరాతీయ॒తో నిద॑హాతి॒ వేదః॑ । స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॑ నా॒వేవ॒ సింధుం॑ దురి॒తాఽత్య॒గ్నిః

·    జాత = జన్మించినది, సృష్టిలో వ్యక్తమైనది. వేద తెలిసినవాడు.

జాతవేద = సృష్టిలో సమస్తాన్ని తెలిసినవాడు.

వైదిక పరంగా జాతవేద అనగా అగ్ని.

అదే శ్రీవిద్య పరంగా, అగ్ని అంటే చిదగ్ని అని రహస్యార్ధము. ఈ చిదగ్ని నుండి ఉద్భవించినదే “చిదగ్నికుండ సంభూతా” – అనగా శ్రీమాత. సమస్తాన్ని తెలిసినది= ఆమె సర్వజ్ఞ. శ్రీలలితారహస్య నామాలలోని “చిదగ్నికుండ సంభూతా” మరియు “సర్వజ్ఞా” నామాలు ఇక్కడ గమనార్హము. పైన మంత్రంలోని జాతవేదయే శ్రీమాత.

·         సునవామ = సమర్పించడం. వైదికంగా సోమరసాన్ని సమర్పించడం. శ్రీవిద్య పరంగా అహంకారం, మనస్సు, కర్మ, వాసనలను, సాధకుడు తనకు తాను పైన చెప్పబడిన చిదగ్నికి సమర్పించడం.

·         సోమమ్ = సోమానికి వైదికంగా అనేక అర్ధాలు ఉన్నాయి. అవి యజ్ఞద్రవ్యం, చంద్రుడు, అమృతం, ఆనందం.

శ్రీవిద్యపరంగా, సోమం అంటే మనస్సు, భక్తి, ఆనందరసం, సహస్రారం నుండి జాలువారే అమృతం అని అర్ధం. అనగా మన అంతరంగాన్ని అమ్మవారికి సమర్పించాలి అని అర్ధము. శ్రీచక్రోపాసనా పరంగా, విశేషార్ఘ్యమే సోమము.

·         అరాతీయతః = అరాతి అంటే శత్రుత్వం. శ్రీవిద్య పరంగా, అది బయటి శత్రువు కాదు. అవి మనలో ఉండే అంతర్గత శత్రువులు – కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు.

·         నిదహాతి = దహిస్తుంది, కాలుస్తుంది. పైన చెప్పబడిన చిదగ్ని సాధకుని వాసనలను, అంతర్గత శత్రువులను దహిస్తుంది.

·         వేదః = సర్వజ్ఞడు. మన అంతరంగాన్ని పూర్తిగా తెలిసిన దేవి – అదే చైతన్యం.

·         సః నః పర్షత్ – ఆమె మమ్మల్ని దాటించాలి.

వేటిని దాటించాలి?

·         అతి దుర్గాణి = సాధారణంగా దుర్గములు అంటే కష్టాలు. కష్టాలను దాటించాలి.

శ్రీవిద్య పరంగా మూడు దుర్గాలు ఉన్నాయి. అవే మూడు మలాలు. అవి 1. ఆణవమలం = నేను చిన్నవాడిని అనే భావం. మరొక అర్ధం - బ్రహ్మనీ, ఆత్మ జ్ఞానాన్నీ తెలుసుకొనకుండా అడ్డుపడే అహంకారం. 2. మాయికామలం = భేదదృష్టి. పరతత్త్వ జ్ఞానవాసన నెప్పుడును కలుగనీయనిది3. కార్మికమలం = కర్మబంధము. గురువు బోధించిన పరమార్థమున బుద్ధి చొరనీయనిది. ఈ మలాలను వదలించుకోవడం చాలా కష్టమైనది. ఈ మలములను శుద్ధి పరచే క్రియయే శ్రీచక్రోపాసనలో చేసే తత్త్వశోధన..

విశ్వా = అన్నీ, ఒక్కటి కాదు. అన్ని దుర్గములను దాటించవేయుట

·         నావేవ = పడవ. ఈ పడవ ఏమిటి? శ్రీవిద్య పరంగా ఈ పడవే గురువు, గురుకృప, గురుమంత్రము. పడవ లేకపోతే సముద్రాన్ని ఏవిధంగా దాటలేమో అదేవిధంగా గురువు లేకుండా ఏ ఉపాసనకూడా సఫలమవదు.

·         సింధుం = సముద్రము. శ్రీవిద్య పరంగా అదే సంసారము.

·         దురితాత్ = పాపము, అజ్ఙానము, కర్మ, వాసనలు.

·         అగ్నిః = అగ్ని. ఈ మంత్రం అగ్నితో మొదలై అగ్నితో ముగుస్తుంది. శ్రీవిద్య ప్రకారం ఇక్కడ రహస్యం ఏమిటంటే, సాధకుడు అగ్ని నుండే ప్రయాణం మొదలుపెడతాడు. అగ్నిలోనే లీనమవుతాడు. అంటే చిదగ్ని నుండే ఉద్భవించి, చిదగ్నిలోనే లీనమవుతాడు.

ఈ మంత్రం యొక్క సంపూర్ణ భావము

ఓ చిదగ్ని స్వరూపిణి శ్రీమాతా! నా అహంకారం, వాసనలు, కర్మబంధాలు అన్నింటినీ నీ జ్ఞానాగ్నికి సమర్పిస్తున్నాను. గురుకృప అనే పడవ ద్వారా నన్ను సంసార సాగరం నుండి దాటించి, నా నిజస్వరూపాన్ని (ఆత్మ సాక్షాత్కారాన్ని) అనుభవించేలా అనుగ్రహించు.

శ్రీలలితాసహస్రనామ స్తోత్రం కూడా ప్రధానంగా చిదగ్నికుండసంభూతా అన్న నామంతోనూ, దుర్గాసూక్తం కూడా అగ్నితోనే ప్రారంభవుతున్నాయి. ఈ విధంగా కూడా ఈ రెండింటికీ సమన్వయం గమనించవచ్చును.

ఇంకా ఉంది