సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, ఆగస్టు 2026, గురువారం

దుర్గాసూక్తము - శ్రీవిద్య పరంగా అర్ధము 7వ మంత్రము

 

7.  గోభి॒ర్జుష్ట॑మయుజో॒నిషి॑క్తం॒తవేం”ద్రవిష్ణో॒రను॒సంచ॑రేమ నాక॑స్య పృ॒ష్ఠమ॒భి సం॒వసా॑నో॒ వైష్ణ॑వీం-లోక ఇ॒హ మా॑దయంతామ్

గోభిః జుష్టమ్ – గోవులచే/కిరణాలచే ప్రసన్నమైనది, పూజింపబడినది. శ్రీవిద్య పరంగా – గో అంటే జ్ఞాన ప్రకాశం. గోభిః జుష్టమ్ అనగా జ్ఞాన ప్రకాశంతో నిండిన చైతన్యం అని అర్థము.

అయుజః నిషిక్తమ్ – అనుసంధానింపబడిన, అభిషిక్తమైన

తవ ఇంద్ర విష్ణోః అనుసంచరేమ – ఇంద్ర, విష్ణువుల దివ్యమార్గాన్ని అనుసరించడం. శ్రీవిద్య పరంగా – ఇంద్ర అనగా ఇంద్రియ నియంత్రణ. విష్ణు అనగా సర్వవ్యాపక చైతన్యం. సాధకుడు ఇంద్రియ చంచలత్వాన్ని అధిగమించి, సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అనుసరించాలి. అనగా అంతర్ముఖత్వం వైపు పయనించడం.

నాకస్య పృష్ఠమ్ – ఉన్నతమైన స్వర్గస్థానం. శ్రీవిద్యపరంగా – ఉన్నతమైన చైతన్యస్థితి. స్థూలచైతన్యం నుండి సూక్ష్మచైతన్యం వైపు, అక్కడ నుండి పరాచైతన్యం వైపు సాధకుడు ఎదగడం.

అభి సంవసానాః – అక్కడ స్థిరంగా నివసిస్తూ

వైష్ణవీం లోకే – విష్ణువుకు సంబంధించిన దివ్యలోకంలో. శ్రీవిద్యపరంగా, వైష్ణవీ శక్తి అనేది సంరక్షణ, స్థితి, ధారణకు సంబంధించిన శక్తి. దైవచైతన్యంలో నిలకడను సాధించడం. వైష్ణవీ శక్తి అష్టమాతృకలలో ఒకశక్తి.

ఇహమాదయంతామ్ – ఇక్కడ ఆనందాన్ని ప్రసాదించుగాక. శ్రీవిద్యపరంగా – కామేశ్వరీ, కామేశ్వరుల ఐక్యస్వరూపం. శ్రీచక్రంలో బిందు స్థానం. అదే సర్వానందమయము.

ఈ మంత్రం యొక్క సంపూర్ణ భావము

వైదికంగా – ఇంద్ర, విష్ణువుల దివ్యమార్గాన్ని అనుసరించి ఉన్నత వైష్ణవ లోకాన్ని పొందాలని చేసే ప్రార్థన.

శ్రీవిద్యపరంగా – ఇంద్రియచంచలత్వాన్ని అధిగమించి, జ్ఞాన ప్రకాశంతో అంతర్ముఖమై, ఉన్నత చైతన్య స్థితుల ద్వారా పరాశక్తి అనుభూతివైపు పురోగమించడానికి సాధకుని అంతరసాధన.

సమాప్తం

కామెంట్‌లు లేవు: