1. 2. తామ॒గ్నివ॑ర్ణాం॒ తప॑సా
జ్వలం॒తీం-వై॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టామ్
।
దు॒ర్గాం దే॒వీగ్ం శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॒ నమః॑ ॥
·
తామ్ = ఆమెను. ఇక్కడ ఆమె అంటే దుర్గాదేవి అని అర్ధం. శ్రీవిద్య పరంగా ఇక్కడ తామ్
అంటే చిదగ్ని. అదే శక్తి.
·
అగ్నివర్ణాం = అగ్ని వంటి తేజస్సు కలది. వెలుగు, పవిత్రత, పాపదహనం,
యజ్ఞముఖం, దేవతలకు హవిస్సును చేర్చేది – ఇవన్నీ
అగ్ని యొక్క లక్షణాలు. అందుకే ఆమె అగ్ని వర్ణ.
ఇప్పుడు శ్రీవిద్య పరంగా చూస్తే – ఈ అగ్ని
బయటది కాదు. చైతన్యాగ్ని. ఈ అగ్ని సాక్షి చైతన్యం. ఈ చైతన్యమే చిత్కలా. చిత్ అంటే సచ్చితానంద
రూపమైనది. పరబ్రహ్మ యొక్క కల. ఈ చిత్కలే చైతన్యము. దీని స్వరూపమైనదే పరమేశ్వరి. ఇది
కుండలినీ యొక్క ప్రజ్వలిత రూపం. ఆమె మూలాధార చక్రంలో సుషుప్తంగా ఉండి, సాధనతో మేల్కొనబడి సహస్రారంలో
పరమశివుడితో ఐక్యం అయ్యే తేజస్సు. శ్రీలలితాసహస్రనామములోని “చిత్కలా” నామము ఇక్కడ గమనించదగినది.
·
తపసాజ్వలంతీమ్ = తపస్సు వల్ల ప్రకాశించేది. వైదికపరంగా తపస్సు అంటే సృష్టికి ముందు
పరబ్రహ్మ యొక్క సంకల్పశక్తి.
శ్రీవిద్య పరంగా చూస్తే – ఇక్కడ తపస్సు అంటే
నిరంతర ఉపాసన, చైతన్యప్రకాశం.
ఉపాసన వలన వ్యక్తమయ్యేది. తపస్సు అనే అగ్నితో మండుతూ వెలుగొందేది. బ్రహ్మే తపస్సు చేసాడని
ఉపనిషత్తులు చెబుతాయి. శ్రీవిద్యోపాసన ద్వారా చైతన్యస్వరూపము అనగా ఆత్మసాక్షాత్కారము
అనగా స్వరూపనిరూపణము కలుగుతుందని అర్ధము. పంచదశీ, షోడశీ మంత్రముల
జపము, శ్రీచక్రార్చనలు తపస్సు అనబడతాయి. ఈ తపః శక్తితో సాధకుని
అంతరంగములో దేవి ప్రజ్వలిస్తుంది.
·
వైరోచనీమ్ = వైదికంగా సర్వాన్నీ ప్రకాశింపచేసేది అని అర్ధము. విరోచన అంటే ప్రకాశించడం.
శ్రీవిద్య పరంగా - విరోచనుడు అంటే పరమశివుడు.
ఈయనది శివ తత్త్వము, ఆమెది శక్తి తత్త్వము. తురీయ స్వరము ఈ బిందువుతో కూడి విరోచనకు కలపగా వైరోచనీం
అవుతున్నాది. అనగా శివశక్తుల ఐక్యత ఇక్కడ కనిపిస్తున్నాది. శ్రీలలితాసహస్రనామములోని
“శివశక్తైక్య రూపిణి” నామము ఇక్కడ గమనించదగినది.
·
కర్మఫలేషు జుష్టామ్ = వైదికంగా అన్ని కర్మలకూ తగిన ఫలాన్ని ప్రసాదించేది.
శ్రీవిద్య పరంగా – కర్మఫలాన్ని త్యాగం చెయ్యాలి.
త్యాగేనైకే అమృతత్వమానశుః అని వేదం చెబుతుంది. త్యాగం వలన మాత్రమే అమృతత్వాన్ని అనగా
మోక్షాన్ని పొందుతారు. శ్రీమాత ధర్మ స్వరూపము. ఆమె ఉనికే కర్మఫల నియమం. ఈ భావన కలిగి
సాధన చెయ్యాలి. సాధన ద్వారా వచ్చే ఫలితాన్ని తిరిగి ఆమెకే సమర్పించాలి. ఇదే అమృతానికి
సుగమము.
శ్రీచక్రార్చనలో చేసే విరజా హోమము ఇక్కడ స్మరించదగినది.
·
దుర్గాం = దుర్గాలను (కష్టాలను) దాటించేది.
శ్రీవిద్య పరంగా – ఇక్కడ కష్టం అంటే నేను అనే
అహంకారం. ఈ అహంకారమే సాధనకు పెద్ద అడ్డంకి/కష్టము. అయితే ఈ అహంకారమనే పెద్ద కష్టాన్ని ఏవిధంగా దాటడం. దానికి
తర్వాత సమాధానం చెప్పబడుతున్నాది.
·
దేవీమ్ = ప్రకాశ స్వరూపిణి
శ్రీవిద్య పరంగా – ఆ ప్రకాశ స్వరూపిణి సాధకునిలోనే
“నేను ఉన్నాను” అనే ఎరుకను కలిగించే సాక్షిచైతన్యం.
·
శరణమహం ప్రపద్యే = నేను ఆమెను శరణు కోరుతున్నాను.
శ్రీవిద్య పరంగా – శరణాగతిని పొందడం. ప్రకాశస్వరూపిణీ, దేవీ నిన్ను పూర్తిగా శరణుగోరుతున్నాను.
అహంకారమనే కష్టమునుండి, అరిషడ్వర్గాలనే కష్టాలనుండి నన్ను కడతేర్చు
అని భావము.
ఈ ప్రార్థన సాధనకు హృదయంలాంటిది. నా సాధన మీద
నాకు గర్వం లేదు. నీ కృపే నాకు మార్గము అని సాధకుడు ఎల్లప్పుడూ భావనలో ఉండాలి. గురు-మంత్ర-దేవత
అనే ఈ మూడు స్తంభాల ద్వారా సాధకుడు శరణు వేడతాడు.
·
సుతరసి = అద్భుతంగా దాటించగలది.
శ్రీవిద్య పరంగా – పై విధంగా సాధన చేయడం వలన
ఒక్కో ఆవరణను ఆమె దాటిస్తుంది. సంహారక్రమంలో చేసే శ్రీచక్రపూజలోని ఒక్కో ఆవరణను దాటుకుంటూ
వెడితే చివరగా లభ్యమయ్యేది బిందువు. అదే శ్రీమాత ఆవాసస్థానము. అదే సహస్రారము, అమృతమయము. అదే మోక్షస్థానము.
సాధకుడును భవసాగరమును దాటించి ఒక్కో మెట్టూ ఎక్కిస్తూ మోక్షమును ప్రసాదించేది. అందుకే
శ్రీచక్రార్చన భోగ-మోక్షప్రదాయిని.
·
తరసే నమః = ఆ దాటించే శక్తికి నమస్కారము
శ్రీవిద్య పరంగా – ఈ విధంగా అమృతమును ప్రసాదించే
ఆ పరమేశ్వరికి నమస్కారము.
ఈ
మంత్రం యొక్క సంపూర్ణ భావము
వైదికంగా
– ఓ అగ్ని తేజస్సుతో ప్రకాశించే దుర్గాదేవీ! నీవు సర్వజగత్తునూ ప్రకాశింపచేస్తూ, ప్రతి కర్మకు తగిన ఫలాన్నిస్తున్నావు.
నిన్ను శరణుకోరుతున్నాను. నన్ను అన్ని కష్టాలనుండి సులభంగా రక్షించు.
శ్రీవిద్యపరంగా
– ఓ చిదగ్ని స్వరూపిణి పరాశక్తీ! నీవే నా బుద్ధికి వెలుగు, నా హృదయానికి శాంతి,
నా కర్మలకు ధర్మస్వరూపానివి. నా అహంకారమనే నిజమైన కష్టాన్ని నీ కృపాగ్నిలో
కరిగించి గురుకృపతో నన్ను నా స్వరూపమైన పరబిందు చైతన్యానికి చేర్చు.
వైదిక దృష్టిలో ఇది అగ్నిదేవత ద్వారా కష్టాలను దాటించే దుర్గాదేవి
మంత్రం. శ్రీవిద్యా దృష్టిలో ఇది పరాశక్తి శ్రీలలితాంబికను, కుండలినీ శక్తిని,
శివ-శక్తుల అభేదాన్ని తెలిపే మంత్రం.
ఇంకా ఉంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి