సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, ఆగస్టు 2026, బుధవారం

దుర్గాసూక్తము - శ్రీవిద్య పరంగా అర్ధము 6వ మంత్రము

 

6.   ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ స॒నాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ॒ సత్సి॑
స్వాంచాఽగ్నే త॒నువం॑ పి॒ప్రయ॑స్వా॒స్మభ్యం॑ చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ

·         ప్రత్నః – ప్రాచీనమైన, అనాదిగా ఉన్నవాడు (వైదికంగా అగ్ని అని భావన). శ్రీవిద్యపరంగా – ప్రాచీనమైనది అనగా శ్రీమాతయే. ఈ మంత్రం శ్రీలలితారహస్యనామాలలోని పూర్వజా’, ‘పురాతనాఅన్న నామాల్ని ధ్రువీకరిస్తున్నది. జగత్తును సృష్టించకమునుపే ఉన్నది. ఆది అంతము లేనిది. సర్వేషాం ఆదిభూతత్వాత్ పురాతనా

·         ఈడ్యః – స్తుతించదగినవాడు, పూజనీయుడు. శ్రీవిద్యపరంగా – పూజనీయురాలు.

అన్నింటికన్నా ముందు ఉన్నది, పంచకృత్యపరాయణ అయిన ఆమె సర్వదా పూజనీయురాలు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆమె అనాదిగా ఉన్నప్పటికీ, ప్రతి సాధకుని హృదయంలో నూతనమైన చైతన్యానుభూతిగా వెలుగుతుంది.

·         అధ్వరేషు – యజ్ఞాలలో, శ్రీవిద్యపరంగా – కుండలి అధిష్టించబడిన చిదగ్ని కుండము. శ్రీవిద్యోపాసకులు ఈ చిదగ్ని కుండములోనే విరజాహోమం చేస్తారు. ఇది గురువుద్వారా నేర్చుకోవలసిన జ్ఞానము.

·         సనాత్ చ హోతా – ప్రాచీనకాలం నుండి యజ్ఞానికి హోతగా ఉన్నవాడు. శ్రీవిద్యపరంగా – సాధకుడు చేసే శ్రీచక్రోపాసనే యజ్ఞము. సాధకుని అంతరంగమే యజ్ఞవేదిక. సాధకుడు చేసే సాధనను – ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసలనే హవిస్సులను హృదయకుండంలో ఉండే జ్ఞానాగ్నికి అర్పించే ప్రధాన హోత శ్రీమాతయే.

·         నవ్యః చ సత్సి – ప్రతి యజ్ఞములో నూతనంగా ప్రత్యక్షమయ్యేవాడు. శ్రీవిద్యపరంగా – ఇది సనాతనమైనా ప్రతి క్షణం నూతనంగా అనుభవింపబడేది. ఇది చాలా అందమైన భావన. అనాది అయిన ఆమె – నిత్యా (శ్రీలలితారహస్యనామము) కూడ. శాశ్వతమైనది. ఎల్లప్పుడూ ఉండేది. శ్రీవిద్యోపాసకులకు ఇది చాలా సాధారణమైన అందమైన భావన ఎందుకంటే, వారు ప్రతిరోజూ అదే మంత్రాన్ని జపించినా, అదే శ్రీచక్రాన్ని ఆరాధిస్తున్నా, దేవీ చైతన్యానుభూతి ప్రతిదశలో కొత్తగా వికసిస్తూ ఉంటుంది. అందుకే ఆమె అనాది, నిత్య మరియు నవ్యఃచ సత్సి (ఎప్పుడూ నూతనంగా ప్రత్యక్షమయ్యేది)

·         స్వాం తనువం పిప్రయస్వ – నీ స్వరూపాన్ని, శక్తిని వృద్ధి చేసుకో, శ్రీవిద్యపరంగా – తనువు అంటే అంతరంగం, చిదగ్ని అని అర్ధం. సాధకునిలో మంత్రశక్తి బలపడడం, చిత్తశుద్ధి కలగడం, అంతర్ముఖత పెరగడం, దేవీభావం స్థిరపడడం మొదలైనవి వృద్ధి చెందడం.

·         అస్మభ్యం చ సౌభగమాయజస్వ – మాకు సౌభాగ్యం, శ్రేయస్సు ప్రసాదించు, శ్రీవిద్యపరంగా – సౌభాగ్యం అంటే దేవీ అనుగ్రహం, మంత్రసిద్ధి, జ్ఞానం, భక్తి, శివశక్తి సామరస్యం మొదలైనవి. ఓ దేవీ, పై విధంగా అంతర్యాగమనే యజ్ఞములో ఆరాధించబడుతున్న నీవు సౌభాగ్యాన్ని, శ్రేయస్సును ప్రసాదించు అని చేసే ప్రార్థన.  

ఈ మంత్రం యొక్క సంపూర్ణ భావము

వైదికంగా – యజ్ఞాగ్నిని స్తుతించి, యజ్ఞాన్ని స్వీకరించి శ్రేయస్సును ప్రసాదించమని చేసే ప్రార్థన.

శ్రీవిద్యపరంగా – హృదయంలో చిదగ్నిని ప్రజ్వలింపచేసి, అంతర్యాగం ద్వారా అహంకారాన్ని సమర్పించి, దేవీచైతన్యాన్ని విస్తరింపచేసి, పరమ సౌభాగ్యమైన శివశక్తి సామరస్యాన్ని ప్రసాదించమని చేసే ప్రార్థన.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: