సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, ఆగస్టు 2026, గురువారం

దుర్గాసూక్తము - శ్రీవిద్య పరంగా అర్ధము 7వ మంత్రము

 

7.  గోభి॒ర్జుష్ట॑మయుజో॒నిషి॑క్తం॒తవేం”ద్రవిష్ణో॒రను॒సంచ॑రేమ। నాక॑స్య పృ॒ష్ఠమ॒భి సం॒​వసా॑నో॒ వైష్ణ॑వీం-లోక ఇ॒హ మా॑దయంతామ్ ॥

గోభిః జుష్టమ్ – గోవులచే/కిరణాలచే ప్రసన్నమైనది, పూజింపబడినది. శ్రీవిద్య పరంగా – గో అంటే జ్ఞాన ప్రకాశం. గోభిః జుష్టమ్ అనగా జ్ఞాన ప్రకాశంతో నిండిన చైతన్యం అని అర్థము.

అయుజః నిషిక్తమ్ – అనుసంధానింపబడిన, అభిషిక్తమైన

తవ ఇంద్ర విష్ణోః అనుసంచరేమ – ఇంద్ర, విష్ణువుల దివ్యమార్గాన్ని అనుసరించడం. శ్రీవిద్య పరంగా – ఇంద్ర అనగా ఇంద్రియ నియంత్రణ. విష్ణు అనగా సర్వవ్యాపక చైతన్యం. సాధకుడు ఇంద్రియ చంచలత్వాన్ని అధిగమించి, సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అనుసరించాలి. అనగా అంతర్ముఖత్వం వైపు పయనించడం.

నాకస్య పృష్ఠమ్ – ఉన్నతమైన స్వర్గస్థానం. శ్రీవిద్యపరంగా – ఉన్నతమైన చైతన్యస్థితి. స్థూలచైతన్యం నుండి సూక్ష్మచైతన్యం వైపు, అక్కడ నుండి పరాచైతన్యం వైపు సాధకుడు ఎదగడం.

అభి సంవసానాః – అక్కడ స్థిరంగా నివసిస్తూ

వైష్ణవీం లోకే – విష్ణువుకు సంబంధించిన దివ్యలోకంలో. శ్రీవిద్యపరంగా, వైష్ణవీ శక్తి అనేది సంరక్షణ, స్థితి, ధారణకు సంబంధించిన శక్తి. దైవచైతన్యంలో నిలకడను సాధించడం. వైష్ణవీ శక్తి అష్టమాతృకలలో ఒకశక్తి.

ఇహమాదయంతామ్ – ఇక్కడ ఆనందాన్ని ప్రసాదించుగాక. శ్రీవిద్యపరంగా – కామేశ్వరీ, కామేశ్వరుల ఐక్యస్వరూపం. శ్రీచక్రంలో బిందు స్థానం. అదే సర్వానందమయము.

ఈ మంత్రం యొక్క సంపూర్ణ భావము

వైదికంగా – ఇంద్ర, విష్ణువుల దివ్యమార్గాన్ని అనుసరించి ఉన్నత వైష్ణవ లోకాన్ని పొందాలని చేసే ప్రార్థన.

శ్రీవిద్యపరంగా – ఇంద్రియచంచలత్వాన్ని అధిగమించి, జ్ఞాన ప్రకాశంతో అంతర్ముఖమై, ఉన్నత చైతన్య స్థితుల ద్వారా పరాశక్తి అనుభూతివైపు పురోగమించడానికి సాధకుని అంతరసాధన.

సమాప్తం

12, ఆగస్టు 2026, బుధవారం

దుర్గాసూక్తము - శ్రీవిద్య పరంగా అర్ధము 6వ మంత్రము

 

6.   ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ స॒నాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ॒ సత్సి॑ ।
స్వాంచాఽగ్నే త॒నువం॑ పి॒ప్రయ॑స్వా॒స్మభ్యం॑ చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ ॥

·         ప్రత్నః – ప్రాచీనమైన, అనాదిగా ఉన్నవాడు (వైదికంగా అగ్ని అని భావన). శ్రీవిద్యపరంగా – ప్రాచీనమైనది అనగా శ్రీమాతయే. ఈ మంత్రం శ్రీలలితారహస్యనామాలలోని ‘పూర్వజా’, ‘పురాతనా’ అన్న నామాల్ని ధ్రువీకరిస్తున్నది. జగత్తును సృష్టించకమునుపే ఉన్నది. ఆది అంతము లేనిది. ‘సర్వేషాం ఆదిభూతత్వాత్ పురాతనా’

·         ఈడ్యః – స్తుతించదగినవాడు, పూజనీయుడు. శ్రీవిద్యపరంగా – పూజనీయురాలు.

అన్నింటికన్నా ముందు ఉన్నది, పంచకృత్యపరాయణ అయిన ఆమె సర్వదా పూజనీయురాలు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఆమె అనాదిగా ఉన్నప్పటికీ, ప్రతి సాధకుని హృదయంలో నూతనమైన చైతన్యానుభూతిగా వెలుగుతుంది.

·         అధ్వరేషు – యజ్ఞాలలో, శ్రీవిద్యపరంగా – కుండలి అధిష్టించబడిన చిదగ్ని కుండము. శ్రీవిద్యోపాసకులు ఈ చిదగ్ని కుండములోనే విరజాహోమం చేస్తారు. ఇది గురువుద్వారా నేర్చుకోవలసిన జ్ఞానము.

·         సనాత్ చ హోతా – ప్రాచీనకాలం నుండి యజ్ఞానికి హోతగా ఉన్నవాడు. శ్రీవిద్యపరంగా – సాధకుడు చేసే శ్రీచక్రోపాసనే యజ్ఞము. సాధకుని అంతరంగమే యజ్ఞవేదిక. సాధకుడు చేసే సాధనను – ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసలనే హవిస్సులను హృదయకుండంలో ఉండే జ్ఞానాగ్నికి అర్పించే ప్రధాన హోత శ్రీమాతయే.

·         నవ్యః చ సత్సి – ప్రతి యజ్ఞములో నూతనంగా ప్రత్యక్షమయ్యేవాడు. శ్రీవిద్యపరంగా – ఇది సనాతనమైనా ప్రతి క్షణం నూతనంగా అనుభవింపబడేది. ఇది చాలా అందమైన భావన. అనాది అయిన ఆమె – నిత్యా (శ్రీలలితారహస్యనామము) కూడ. శాశ్వతమైనది. ఎల్లప్పుడూ ఉండేది. శ్రీవిద్యోపాసకులకు ఇది చాలా సాధారణమైన అందమైన భావన ఎందుకంటే, వారు ప్రతిరోజూ అదే మంత్రాన్ని జపించినా, అదే శ్రీచక్రాన్ని ఆరాధిస్తున్నా, దేవీ చైతన్యానుభూతి ప్రతిదశలో కొత్తగా వికసిస్తూ ఉంటుంది. అందుకే ఆమె అనాది, నిత్య మరియు నవ్యఃచ సత్సి (ఎప్పుడూ నూతనంగా ప్రత్యక్షమయ్యేది)

·         స్వాం తనువం పిప్రయస్వ – నీ స్వరూపాన్ని, శక్తిని వృద్ధి చేసుకో, శ్రీవిద్యపరంగా – తనువు అంటే అంతరంగం, చిదగ్ని అని అర్ధం. సాధకునిలో మంత్రశక్తి బలపడడం, చిత్తశుద్ధి కలగడం, అంతర్ముఖత పెరగడం, దేవీభావం స్థిరపడడం మొదలైనవి వృద్ధి చెందడం.

·         అస్మభ్యం చ సౌభగమాయజస్వ – మాకు సౌభాగ్యం, శ్రేయస్సు ప్రసాదించు, శ్రీవిద్యపరంగా – సౌభాగ్యం అంటే దేవీ అనుగ్రహం, మంత్రసిద్ధి, జ్ఞానం, భక్తి, శివశక్తి సామరస్యం మొదలైనవి. ఓ దేవీ, పై విధంగా అంతర్యాగమనే యజ్ఞములో ఆరాధించబడుతున్న నీవు సౌభాగ్యాన్ని, శ్రేయస్సును ప్రసాదించు అని చేసే ప్రార్థన.  

ఈ మంత్రం యొక్క సంపూర్ణ భావము

వైదికంగా – యజ్ఞాగ్నిని స్తుతించి, యజ్ఞాన్ని స్వీకరించి శ్రేయస్సును ప్రసాదించమని చేసే ప్రార్థన.

శ్రీవిద్యపరంగా – హృదయంలో చిదగ్నిని ప్రజ్వలింపచేసి, అంతర్యాగం ద్వారా అహంకారాన్ని సమర్పించి, దేవీచైతన్యాన్ని విస్తరింపచేసి, పరమ సౌభాగ్యమైన శివశక్తి సామరస్యాన్ని ప్రసాదించమని చేసే ప్రార్థన.

ఇంకాఉంది...

5, ఆగస్టు 2026, బుధవారం

దుర్గాసూక్తము - శ్రీవిద్య పరంగా అర్ధము 5వ మంత్రము

 

1.    5. పృ॒త॒నా॒ జిత॒గ్ం॒ సహ॑మానము॒గ్రమ॒గ్నిగ్ం హు॑వేమ పర॒మాథ్స॒ధస్థాత్ ।
స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॒ క్షామ॑ద్దే॒వో అతి॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥

·         పృతనాజితమ్ – యుద్ధాలలో విజయం సాధించేవాడు. శ్రీవిద్య పరంగా, ఇక్కడ యుద్ధం అంటే అంతర్ముఖ యుద్ధం. అరిషడ్వర్గాలను జయించే శక్తి. ఆమె శ్రీలలితా పరాభట్టారిక

·         సహమానం – శత్రువులను, విఘ్నాలను జయించేవాడు.

·         ఉగ్రమ్ – మహాపరాక్రమశాలి

సుషుమ్నా నాడి ద్వారా కుండలినీ శక్తి ఊర్ధ్వముఖంగా పయనించేటప్పుడు అజ్ఞానాన్ని, మాయను మరియు బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంథులను భేదించే తీవ్రమైన యోగాగ్ని/చిదగ్ని. పై రెండు మహాకాళీ, వారాహీ మొదలైన విఘ్ననాశక శక్తులను గుర్తు చేస్తుంది. సాధకునిలోని అవిద్య, కర్మబంధం, మలాలను దహించే చిదగ్ని శక్తి.

·         అగ్నిమ్ హువేమ – అగ్నిదేవుని ఆహ్వానిస్తున్నాము. శ్రీవిద్య పరంగా ఈ అగ్ని – చిదగ్ని, కుండలినీ శక్తి, శ్రీమాత యొక్క జ్ఞానాగ్ని

·         పరమాత్ సధస్థాత్ – పరమమైన దివ్యస్థానం నుండి. శ్రీవిద్య పరంగా, ఇది బిందువు స్థానం. కామేశ్వరి, కామేశ్వరుల నివాసస్థానము. ఇది మానవ శరీరంలో సహస్రార చక్రము. అక్కడ నుండి ప్రసరించే పరాశక్తిని సాధకుడు ఆవాహన చేస్తున్నాడు.

·         సనః పర్షత్ – ఆయన మమ్మల్ని దాటించుగాక

·         అతి దుర్గాణి విశ్వా – అన్ని కష్టాలను, ప్రమాదాలను

శ్రీవిద్యపరంగా – శ్రీవిద్యాసాధనలోని విఘ్నాలు, మంత్రజప అవరోధాలు, అహంకారం, కర్మబంధాలు, మాయా భ్రమలు మొదలైనవి

·         క్షామత్ – కష్టాలు, దుఃఖాలు, దారిద్ర్యం నుండి. శ్రీవిద్య పరంగా, ఇక్కడ క్షామ అంటే ఆధ్యాత్మిక బలహీనత, భక్తి తగ్గిపోవడం, మనస్సు చంచలత వంటివి

·         దేవః అగ్నిః – దివ్యస్వరూపుడైన అగ్నిదేవుడు, శ్రీవిద్య పరంగా – ఓ చిదగ్నికుండ సంభూత శ్రీమాతా

·         అతి దురితాత్ – సమస్త పాపాలు, అపాయాల నుండి

ఈ మంత్రం యొక్క సంపూర్ణ భావము

వైదికంగా – అగ్నిదేవుని పరాక్రమాన్ని స్తుతిస్తూ జీవనంలో అన్ని కష్టాలు, ప్రమాదాలు, శత్రువులు, దురితాల నుండి రక్షణకోరే మంత్రము. ఇది ప్రత్యక్ష భావాన్ని తెలుపుతున్నది.

శ్రీవిద్యపరంగా – చిదగ్నిరూపిణి శ్రీమాతను ఆవాహన చేసి, అంతర్గత శత్రువులను జయించి, మాయా-కర్మ బంధాలను అధిగమించి, శ్రీచక్ర బిందు తత్త్వమైన పరబ్రహ్మానుభూతికి చేరాలని చేసే ప్రార్ధన. ఇది అంతర్లీన భావాన్ని తెలుపుతుంది.

ఇంకాఉంది...